మిట్స్ యూనివర్సిటీలో రక్తదాన శిబిర కార్యక్రమం.

130 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకుల రక్తదానం

మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు మదనపల్లె రోటరీ క్లబ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, బెంగళూరు వారి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరము కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ యూనివర్సిటీ ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్ మాట్లాడుతూ రక్తదానం అనేది మానవతా సేవలో అత్యంత గొప్పదిగా పరిగణించబడుతుంది అని, కేవలం ఆరోగ్యవంతుల బాధ్యత మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడు తనవంతు సేవ చేయవలసిన గొప్ప కర్తవ్యమని గుర్తు చేశారు. ప్రమాదాల్లో గాయపడిన వారు, ఆపరేషన్‌కు లోనయ్యే వారు, గర్భిణీ స్త్రీలు మరియు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి రక్తదానం ఎంతో అవసరం. ఇది కేవలం అవసరమైన వారికి సహాయపడడమే కాకుండా, రక్తదాత ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పాత రక్తకణాలు తొలగిపోయి, శరీరంలో కొత్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేందుకు బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ చేయడం చాలా అవసరం అని అన్నారు. అటువంటి రక్త నిల్వలు మనం రక్తదానం చేయడం ద్వారా ఏర్పడతాయి. కనుక ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలి అని ఆయన అన్నారు. రోటరీ క్లబ్ ప్రతినిధి పి.ఎస్ చైతన్య మాట్లాడుతూ,
విద్యార్థులు రక్తదానం పట్ల చూపిన ఉత్సాహం ప్రశంసనీయమని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడమే కాకుండా, మానవతా విలువలను బలపరుస్తాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహించి మరెక్కువ మందికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విద్యార్థులు ఎంతో ఆసక్తి తో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు అని అన్నారు. కార్యక్రమంలో సుమారు 130 మందికి పైగా విద్యార్థులు మరియు అధ్యాపకులు రక్త దానం చేసారు. మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గుర్తిస్తూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, బెంగళూరు వారు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ పేరుతో సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమము లో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ సతీష, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గురుమూర్తి, డాక్టర్ మణికంఠ నాయుడు, యెన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ పి. రాజేష్ మరియు యెన్.ఎస్.ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *