170 మందికి పైగా విద్యార్థులు.. 50 బృందాలుగా పాల్గొని వినూత్న ఆలోచనల ప్రదర్శన
మదనపల్లె: (gtvmedia)మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో పాత్విజన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ ప్రో టీమ్ సహకారంతో రెండు రోజుల ‘ఇన్నోవేషన్ నెక్సస్–2026’ 16 గంటల ఇన్నోవేషన్, హ్యాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఈసీఈ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాస్ తలబట్టుల, మిట్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ శ్రీనివాస్ తలబట్టుల మాట్లాడుతూ.. హ్యాకథాన్ అనేది కేవలం పోటీ కాదని, తరగతి గదికి వెలుపల విద్యార్థులు తమ ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకునే నైపుణ్యాభివృద్ధి వేదిక అని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, కమ్యూనికేషన్, సృజనాత్మకత, ఆవిష్కరణ, ప్రాజెక్టు అభివృద్ధి వంటి నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందుతాయని తెలిపారు.

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో హ్యాకథాన్లు కీలకంగా ఉపయోగపడతాయని అన్నారు. పరిమిత సమయంలో బృందంగా పనిచేసి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలు, పరిశోధనా విధానాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
హ్యాకథాన్లో 170 మందికి పైగా విద్యార్థులు 50 బృందాలుగా పాల్గొన్నారు. వివిధ సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందించేలా విద్యార్థులు తమ ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించారు.

విజేతలకు నగదు బహుమతులు
హ్యాకథాన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బృందాలకు నగదు బహుమతులు అందజేశారు.
- ప్రథమ బహుమతి: టీమ్ టెక్ విజన్–మిట్స్ — రూ.25,000
- ద్వితీయ బహుమతి: టీమ్ ఏజీఎస్–మిట్స్ — రూ.15,000
- తృతీయ బహుమతి: టీమ్ కేఎంపీవో ఇన్నోవేటర్–మిట్స్ — రూ.10,000
బెంగళూరుకు చెందిన గీతం యూనివర్సిటీ ఈసీఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీత పాండా, పాత్విజన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ యతీంద్ర నాథ్ రెడ్డి దేవసాని విజేతలకు నగదు బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో మిట్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి. గోరె, కోఆర్డినేటర్లు డాక్టర్ సిమాద్రి బదత్యా, డాక్టర్ నూరుల్ ఇస్లాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
