మిట్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఫ్రెషర్స్ డే–2026 వేడుకలు.

మదనపల్లె సమీపం లో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఫ్రెషర్స్ డే-2026 వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మిట్స్ యూనివర్సిటీ లో చేరిన నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ 2026 ఫ్రెషర్స్ డేని ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఈ. శ్రీనివాస చక్రవర్తి, వైస్ ప్రెసిడెంట్ & హెడ్ – రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్, ఆమ్‌డాక్స్ (Amdocs), స్ట్రాటజిక్ అడ్వైజర్ – ఆదిచుంచనగిరి గ్రూప్, మాజీ వైస్ ప్రెసిడెంట్ & గ్లోబల్ హెడ్ – రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్, గ్లోబల్ మొబిలిటీ అండ్ షేర్డ్ సర్వీసెస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథి తో పాటు మిట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. సి.యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, తదితరులు జ్యోతి ప్రజ్వలనతో కార్యకమాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యకమం లో డాక్టర్ ఈ. శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే నాలుగేళ్లలో ప్రతి విద్యార్థి మూడు ప్రధాన లక్ష్యాలను సాధించాలని అన్నారు. మొదటిగా, 2030 నాటికి ప్రతి విద్యార్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి, తమ విభాగానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిష్కారాలను రూపొందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. రెండవది, సమస్యలను గుర్తించి, వాటికి సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని, ఇది ఉన్నత విద్య, ఉద్యోగాలు, పరిశోధనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక రంగాల్లో రాణించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మూడవది, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం, ఇతరులకు అర్థమయ్యేలా వివరించడం, ప్రజెంటేషన్ల ద్వారా ప్రభావవంతంగా తెలియజేయడం వంటి కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఏఐ పరిజ్ఞానం, సమస్య పరిష్కార సామర్థ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ అనే ఈ మూడు లక్ష్యాలను సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు, సాంకేతిక రంగంలో విజయవంతమైన ఇంజనీర్లుగా ఎదగగలరని ఆయన అన్నారు. ప్రస్తుత ఏఐ, ఏజెంటిక్ టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో విద్యార్థులు రాణించేందుకు ఐదు కీలక సాంకేతిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గణితం, డేటా సైన్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మరియు కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ (MLOps), పైథాన్ ప్రోగ్రామింగ్‌లను భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో విజయానికి అవసరమైన ముఖ్యమైన నైపుణ్యాలుగా వివరించారు. ఏఐ అభివృద్ధికి గణితం పునాది కాగా, డేటా దాని పనితీరుకు అత్యంత కీలకమని తెలిపారు. ఏఐ వ్యవస్థలకు సరైన సూచనలు ఇవ్వడం, అవసరమైన సమాచారాన్ని సందర్భానుసారంగా అందించడం, క్లౌడ్ సాంకేతికతను వినియోగించడం, మెషిన్ లెర్నింగ్ మోడళ్లను నిర్వహించడం, పైథాన్ ప్రోగ్రామింగ్‌ను అభ్యసించడం వంటి అంశాలపై విద్యార్థులు నిరంతరం సాధన చేయాలని సూచించారు. ఈ నైపుణ్యాలను పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం చేయకుండా స్వయంగా నేర్చుకుంటూ, ప్రాజెక్టుల ద్వారా ఆచరణలో పెట్టాలని తెలిపారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ఉపయోగపడే ఏఐ ఆధారిత ఏజెంటిక్ ఫ్రేమ్‌వర్క్‌ల రూపకల్పనలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్య అతిథి డాక్టర్ ఈ. శ్రీనివాస చక్రవర్తి తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేస్తూ, సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకొని సమాజానికి, దేశాభివృద్ధికి ఉపయోగపడే ఉత్తమ ఇంజనీర్లుగా ఎదగాలని తెలిపారు. అనంతరం నూతన విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, వినోదభరిత ప్రదర్శనలతో సందడి చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డీన్-ఫస్ట్ ఇయర్ బీటెక్ డాక్టర్ చంద్ర మోహన్, డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, డీన్ స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, డైరెక్టర్-అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి. కమల్ బాషా, సాక్ కోఆర్డినేటర్ డాక్టర్ రెడ్డి హేమంత, శాయీజ్ అహమ్మద్, నవీన్ కుమార్, యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *