మిట్స్‌లో IEEE, EBSCO జర్నల్స్‌పై అవగాహన సదస్సు

మదనపల్లె: అక్టోబర్ 6:పరిశోధన రంగంలో విద్యార్థులు, అధ్యాపకులు నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు నిపుణులు సూచించారు. మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో IEEE, EBSCO పరిశోధనా వనరులు, ఓపెన్ సైన్స్ విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి IEEE–EBSCO ట్రైనింగ్ మేనేజర్ డాక్టర్ ఆర్. పెరియసామి ప్రదీప్, చెన్నై రీజినల్ సేల్స్ మేనేజర్ ఎస్.ఆర్. మంజునాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మిట్స్ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, సెంట్రల్ లైబ్రరీ ఇన్‌చార్జి డాక్టర్ సురేష్ బాబు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఆర్. పెరియసామి ప్రదీప్ మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధనకు అవసరమైన నాణ్యమైన జర్నల్స్, సమాచారాన్ని IEEE, EBSCO వంటి వనరుల ద్వారా పొందవచ్చని తెలిపారు. పరిశోధనా విధానాలు, సాహిత్య సమీక్ష, ఆన్‌లైన్‌లో పరిశోధనా జర్నల్స్‌ను శోధించే పద్ధతులపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించారు.

ఇంటర్నెట్‌లో పరిశోధనకు సంబంధించిన విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ, అందులో విశ్వసనీయమైన, విలువైన సమాచారాన్ని గుర్తించి వినియోగించుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ఎస్.ఆర్. మంజునాథ్ మాట్లాడుతూ మారుతున్న పరిశోధనా రంగంలో ఓపెన్ సైన్స్ విధానాల ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. పరిశోధనా ఫలితాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పరిశోధనకు గుర్తింపు, ప్రాచుర్యం, ప్రభావం పెరుగుతాయని వివరించారు. విశ్వసనీయమైన పరిశోధనా వనరులను గుర్తించడం, అధికారిక సమాచార వేదికలను వినియోగించడం, అవసరమైన సమాచారాన్ని సేకరించడం, సాహిత్య సమీక్షలను మెరుగుపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

పరిశోధనా వ్యాసాలు, విద్యా ప్రాజెక్టులు, అకడమిక్ ప్రచురణల నాణ్యతను పెంపొందించడంలో IEEE వనరులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించుకోవడం, నాణ్యమైన సమాచారాన్ని గుర్తించడం, అందుబాటులో ఉన్న విద్యా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై సదస్సులో పాల్గొన్న వారికి మార్గదర్శనం చేశారు.

కార్యక్రమం అనంతరం సదస్సులో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. గంగిశెట్టి, కోఆర్డినేటర్ శ్రీనివాసులు, పీజీ విద్యార్థులు, పీహెచ్‌డీ పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *