మదనపల్లె,సెప్టెంబర్ 25:మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకులకు “ఏఐ యుగంలో పరిశోధనా నైతికత – రీసెర్చ్ ఆర్టికల్ రిట్రాక్షన్ నివారణ” అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక (NITK), సూరత్‌కల్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కట్టా వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ (AI) వినియోగం విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో పరిశోధనా నైతికత, పరిశోధనా సమగ్రత, పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఉందన్నారు.



పరిశోధనలో తప్పుడు సమాచారం, ప్లాగరిజం వంటి అనైతిక పద్ధతులతో పాటు ఏఐ సాధనాలను బాధ్యతారహితంగా వినియోగించడం వల్ల పరిశోధన నాణ్యత, విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. ప్లాగరిజం అంటే కేవలం ఇతరుల రచనలను కాపీ చేయడం మాత్రమే కాదని, ఇతరుల సమాచారాన్ని ఉపయోగించినప్పుడు సరైన ఆధారాలు, మూలాలను పేర్కొనడం, ఏఐ సాధనాలను బాధ్యతాయుతంగా వినియోగించడం ద్వారా పరిశోధనా నైతికతను కాపాడుకోవచ్చని తెలిపారు.
పరిశోధనా వ్యాసం తయారీ నుంచి జర్నల్‌లో ప్రచురణ వరకు జరిగే వివిధ దశలను, పరిశోధనా వ్యాసాలు ఉపసంహరించబడటానికి గల కారణాలను, కమిటీ ఆన్ పబ్లికేషన్ ఎథిక్స్ (COPE) మార్గదర్శకాలను ఆయన వివరించారు. శాస్త్రీయ రికార్డులో ఉన్న తప్పులను సరిదిద్దేందుకు రీసెర్చ్ ఆర్టికల్ రిట్రాక్షన్ ఒక ముఖ్యమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.
ముఖ్యంగా పరిశోధనకు సంబంధించిన డేటా, రికార్డులు, ఆధారాలను క్రమబద్ధంగా భద్రపరచుకోవడం ఎంతో అవసరమని డాక్టర్ కట్టా వెంకటరమణ సూచించారు. భవిష్యత్తులో పరిశోధనకు సంబంధించిన ప్రశ్నలు, విచారణలు లేదా వ్యాస ఉపసంహరణకు సంబంధించిన అంశాలు తలెత్తినప్పుడు సరైన ఆధారాలతో స్పందించేందుకు ఈ రికార్డులు ఉపయోగపడతాయని తెలిపారు.
వైద్య, ఇంజినీరింగ్ రంగాలకు సంబంధించిన పరిశోధనా వ్యాసాల ఉపసంహరణపై పలు కేస్ స్టడీలను వివరించారు. అలాగే పరిశోధనా వ్యాసాన్ని జర్నల్‌కు పంపే ముందు నైతిక ప్రమాణాలు పాటించామా లేదా పరిశీలించేందుకు ఉపయోగపడే రీసెర్చ్ ఎథిక్స్ చెక్‌లిస్ట్పై అధ్యాపకులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, అసోసియేట్ డీన్–ఆర్ & డి డాక్టర్ పి. శివయ్య, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
