మాజీ సైనికులకు కేటాయించిన స్థలాన్ని అప్పగించాలి: అన్ని పార్టీల నాయకుల డిమాండ్

మదనపల్లి, జూలై 27: (gtvmedia)మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మాజీ సైనికులకు కేటాయించిన స్థలాన్ని వారికి అప్పగించాలని మాజీ సైనిక సంక్షేమ సంఘానికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు సోమవారం డిమాండ్ చేశారు.

ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడుకు మద్దతుగా టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ గంగారపు రామదాసు చౌదరి మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం సేవలందించిన మాజీ సైనికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మాజీ సైనికులకు కేటాయించిన స్థలం విషయంలో రాజీ మార్గంలో పరిష్కారం చూపాలని సుప్రీంకోర్టు ఇప్పటికే సూచించిన నేపథ్యంలో, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

బీజేపీ సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ, దాదాపు రెండు దశాబ్దాలుగా కోర్టు పరిధిలో కొనసాగుతున్న ఈ సమస్యను జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో చొరవ తీసుకుని శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు సీడ్ మల్లికార్జున నాయుడు, కాంగ్రెస్ నాయకుడు రెడ్డి సాహెబ్, జనసేన నాయకుడు శ్రీరామ రామాంజనేయులు, బీజేపీ నాయకుడు బండి ఆనంద్తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

మాజీ సైనికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని నాయకులు ఒకే స్వరంతో డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *