మదనపల్లె జిల్లాకు జిడ్డు కృష్ణమూర్తి పేరు పెట్టాలి: డాక్టర్ కె. నారాయణ

మదనపల్లె, ఆగస్టు 6: (gtvmedia)దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సమూల మార్పు కోసం సీపీఐ చేపట్టిన ప్రజా ప్రచార కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె. నారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మదనపల్లెలో జన్మించిన అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి పేరును మదనపల్లె జిల్లాకు నామకరణం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.

జిడ్డు కృష్ణమూర్తి స్వేచ్ఛాయుత ఆలోచన, మానవ విలువలు, వ్యక్తిగత పరివర్తన, స్వతంత్ర చింతన వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రభావం చూపిన మహానుభావుడని డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు నేటికీ ప్రపంచంలోని అనేక దేశాల్లో అధ్యయనానికి, చర్చలకు కేంద్రబిందువుగా ఉన్నాయని తెలిపారు.

మదనపల్లెతో విడదీయరాని అనుబంధం ఉన్న జిడ్డు కృష్ణమూర్తి గౌరవార్థం జిల్లాకు ఆయన పేరు పెట్టడం ద్వారా భారతదేశపు గొప్ప తత్వవేత్తలలో ఒకరికి తగిన గౌరవం దక్కుతుందని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు, మదనపల్లెకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *