రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం – మదనపల్లె సమీపంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి మార్గం సుగమం
మదనపల్లె, ఆగస్టు 7 (gtvmedia ): అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె మండలంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.
మదనపల్లె మండలం వలసపల్లె గ్రామ పరిధిలో, నవోదయ విద్యాలయానికి ఎదురుగా, రెవెన్యూ భవనానికి ఎడమ వైపున ఉన్న రెండు ఎకరాల భూమిని టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించారు. దీంతో జిల్లా స్థాయిలో పార్టీకి శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది.
ఈ నిర్ణయంపై టీడీపీ మదనపల్లె మండల అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల గిరి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి, కార్యకలాపాల సమన్వయానికి జిల్లా కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.
