రెస్టారెంట్లు, హోటళ్లలో నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాలు – తనిఖీలు నిరంతరం కొనసాగించాలని బహుజన యువసేన డిమాండ్
మదనపల్లె, ఆగస్టు 3: (gtvmedia)
మదనపల్లెలో ఆహార భద్రతాధికారి హరిత ఆధ్వర్యంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లపై సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు, అపరిశుభ్ర వాతావరణం, నాణ్యత లేని వంటనూనెల వినియోగం వంటి అంశాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. నిబంధనలు పాటించని నిర్వాహకులపై జరిమానాలు విధించి, లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.
తనిఖీల సందర్భంగా వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, గడువు ముగిసిన వస్తువుల వినియోగం, వంటనూనెల నాణ్యత, FSSAI నిబంధనల అమలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ ఆహారంపై ప్రభుత్వం తనిఖీలను ముమ్మరం చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిణామాలపై స్పందించిన బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మదనపల్లెలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాణ్యతలేని ఆహారం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.
