మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.82,800 లంచం సొమ్ము!

21 గంటల పాటు ఏసీబీ సోదాలు.. రూ.1.27 లక్షల నగదు స్వాధీనం

మదనపల్లె, ఆగస్టు 25:( gtvmedia)మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజులుగా కొనసాగిన ఏసీబీ సోదాల్లో ఎట్టకేలకు లంచం సొమ్ము బయటపడింది. కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు వెల్లడించిన వివరాల మేరకు.. కార్యాలయంలో వివిధ పనులకు లంచాలు వసూలు చేస్తున్నారంటూ ఏసీబీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలో కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలో 12 మంది ఏసీబీ అధికారులు సుమారు 21 గంటల పాటు ఏకధాటిగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం రూ.1,27,800 నగదు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

అందులో రూ.45,000 ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ముగా గుర్తించగా, మిగిలిన రూ.82,800ను లంచం సొమ్ముగా ఏసీబీ అధికారులు నిర్ధారించినట్లు డీఎస్పీ సీతారామరావు వెల్లడించారు.

సోదాల్లో గుర్తించిన అంశాలు, నగదు వివరాలపై ఏసీబీ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు ఆయన తెలిపారు.

అవినీతికి అడ్డాగా మారిందా?

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి పనికీ లంచాలు వసూలు చేస్తున్నారంటూ గతంలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాజా ఏసీబీ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కార్యాలయంలో లంచం లేకుండా పనులు జరగడం లేదన్న ఆరోపణలకు తాజాగా ఏసీబీ సోదాల్లో భారీగా నగదు పట్టుబడటం బలం చేకూర్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే నగదుకు సంబంధించిన తుది బాధ్యతలు, అవినీతి ఆరోపణలపై పూర్తి వివరాలు ఏసీబీ దర్యాప్తు, అధికారిక నివేదికల అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *