మదనపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలి

టీడీపీ శ్రేణులకు అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపు

మదనపల్లె, సెప్టెంబర్ 30: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న మదనపల్లెలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బుధవారం సాయంత్రం మదనపల్లిలోని ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, టీడీపీ పరిశీలకుడు నెట్టెం వెంకటేష్, టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మదనపల్లిలో ఏర్పాటు కానున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాంత అభివృద్ధికి కీలకమైన అవకాశంగా నిలుస్తుందని అన్నారు. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు ఘన స్వాగతం పలికేలా టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

మదనపల్లి నియోజకవర్గంలోని మూడు మండలాలు, 55 గ్రామ పంచాయతీలు, మదనపల్లి మున్సిపాలిటీ పరిధి నుంచి 20 వేల మందికి పైగా ప్రజలను కార్యక్రమానికి తరలించేలా కార్యాచరణ చేపట్టాలని టీడీపీ క్రియాశీలక కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

హార్టికల్చర్ హబ్ ద్వారా ఉద్యాన పంటలకు మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ వంటి రంగాల్లో అవకాశాలు పెరిగేలా ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని మంత్రి కోరారు. స్థానికంగా భారీగా ప్రజా భాగస్వామ్యం ఉండేలా మండల, గ్రామ, బూత్ స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *