మదనపల్లె, ఆగస్టు 14: (gtvmedia)వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఎన్నికలను బహిష్కరిస్తామని మదనపల్లె మండలం బోడిమల్లెదిన్నె గ్రామానికి చెందిన వాల్మీకి బోయలు ఏకగ్రీవంగా తీర్మానించారు. గురువారం రాత్రి స్థానిక ఆలయం వద్ద నిర్వహించిన సమావేశంలో వారు సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా వాల్మీకి బోయలు మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీలు ఇస్తూ ఓట్లు పొందుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు పూర్తయిన అనంతరం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తమను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై రాజకీయ పార్టీల హామీలను నమ్మి మోసపోకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కల్పించే వరకు ఎలాంటి ఎన్నికల్లోనూ ఓటు వేయకుండా ఎన్నికలను బహిష్కరిస్తామని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు.
తమ న్యాయమైన డిమాండ్ అయిన ఎస్టీ హోదా సాధించే వరకు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
