సంచలన తీర్పునిచ్చిన చిత్తూరు మహిళా ప్రత్యేక కోర్టు
మదనపల్లె సెప్టెంబరు 15: కట్టుకున్న భార్యను పట్టపగలు నడిరోడ్డుపై కొడవలితో కిరాతకంగా నరికి చంపిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ మేరకు చిత్తూరులోని 6వ అదనపు జిల్లా కోర్టు (మహిళలపై నేరాల ప్రత్యేక న్యాయస్థానం) న్యాయాధికారి టి. హరిత తీర్పు వెలువరించారు.
మదనపల్లె టౌన్ CTM రోడ్డులోని బాపూజీ పార్క్ వద్ద, రఘు తన భార్య పడపట్ల లక్ష్మీదేవమ్మను కొడవలితో అతి దారుణంగా నరికి చంపాడు.
ఈ దారుణ ఘటనపై అప్పటి మదనపల్లె 2-టౌన్ ఎస్ఐ జి. హేమాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు సమర్పించిన బలమైన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడు రఘు భార్యను హత్య చేసినట్లు (సెక్షన్ 302 IPC), మరియు గృహహింసకు పాల్పడినట్లు (సెక్షన్ 498-A IPC) నిర్ధారించింది.
నేరం రుజువు కావడంతో సెక్షన్ 302 IPC కింద నిందితుడికి జీవితకాల కఠిన కారాగార శిక్ష (యావజ్జీవ శిక్ష) విధించడంతో పాటు రూ. 500/- జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే, అదనంగా మరో రెండు వారాలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో స్పష్టం చేసింది.
