కన్విక్షన్ రేటు పెంచేందుకు పకడ్బందీగా చార్జిషీట్లు దాఖలు చేయాలి
పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు
మదనపల్లె, ఆగస్టు 29:(gtvmedia )నేరాలకు పాల్పడిన నిందితులకు కోర్టుల్లో కఠిన శిక్షలు పడేలా పకడ్బందీగా చార్జిషీట్లు దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసు అధికారులను ఆదేశించారు. కన్విక్షన్ రేటును మరింత పెంచే విధంగా దర్యాప్తు అధికారులు, కోర్టు లైజన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో కోర్టు లైజన్ అధికారులు, కానిస్టేబుళ్లతో ఎస్పీ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, శిక్షల శాతం, పెండింగ్ వారెంట్ల అమలు తదితర అంశాలపై సమీక్షించారు.
పోక్సోతో పాటు ఇతర తీవ్రమైన నేర కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. బాధితులకు పోలీసు శాఖ అండగా ఉంటుందనే భరోసా కల్పించడంతో పాటు, కేసుల దర్యాప్తు, విచారణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. పెండింగ్ వారెంట్లను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు.
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ అవార్డు సాధించిన ‘సీఎంఎస్’ యాప్‌ను వందశాతం వినియోగించుకోవాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కేసుల పురోగతిని పర్యవేక్షించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ‘సీఎంఎస్’ యాప్‌ను రూపొందించి జిల్లా పోలీసు శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చినందుకు ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో సీఎంఎస్ ఇన్‌స్పెక్టర్ జె. ప్రసాద్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
