నేపాల్‌లో మహా ప్రళయం.. 675కు చేరిన మృతుల సంఖ్య

2,426 మంది గల్లంతు.. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

కాఠ్మాండు: నేపాల్‌ను భారీ వరదలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భోటేకోశి–త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో సంభవించిన వరద బీభత్సంలో మృతుల సంఖ్య 675కు చేరింది. మరో 2,426 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

రసువా, నువాకోట్, ధాదింగ్‌తో పాటు పలు జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇళ్లు, రహదారులు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బురద, రాళ్లు, శిథిలాలు మీటర్ల మేర పేరుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

మహా ప్రళయం.. ఇది రోడ్డు కాదు.. ఫస్ట్ ఫ్లోర్!

నేపాల్‌లో వరద విధ్వంసం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి అక్కడి నుంచి వెలువడుతున్న దృశ్యాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. త్రిశూలి నది ఉగ్రరూపానికి రోడ్లు, ఇళ్లు, వంతెనలు మట్టిలో కలిసిపోయాయి.

కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల మొదటి అంతస్తు వరకు బురద, రాళ్లు, శిథిలాలు నిండిపోయాయి. ఆ బురద గట్టిపడి రోడ్డులా కనిపించే పరిస్థితి నెలకొంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు పట్టణాలు, గ్రామాల్లో ఇదే తరహా విధ్వంసం కనిపిస్తోంది.

వరదల ఉధృతికి భారీ మొత్తంలో మట్టి, రాళ్లు కొట్టుకురావడంతో అనేక ప్రాంతాలు పూర్తిగా బురదమయంగా మారాయి. ఈ బురద కింద ఎంతమంది చిక్కుకున్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోవడంతో సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

కొనసాగుతున్న సహాయక చర్యలు

నేపాల్ ఆర్మీ, పోలీసు, సాయుధ పోలీసు బలగాలతో పాటు ఇతర సహాయక బృందాలు గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే భారీ వర్షాలు, దెబ్బతిన్న రహదారులు, కొండ ప్రాంతాల్లోని క్లిష్ట పరిస్థితులు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారుతున్నాయి.

జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద బురదతో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం కూడా ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *