అలిపిరి ఫుట్‌పాత్ నుంచి తిరుమల GNC వరకు విస్తృత తనిఖీలు

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాలినడక భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు

తిరుపతి/తిరుమల, ఆగస్టు 29: రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అలిపిరి ఫుట్‌పాత్ నుంచి తిరుమల GNC వరకు సంయుక్త బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్‌, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్, బాంబ్ డిస్పోజల్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్, ఎక్సైజ్, ఎలక్ట్రికల్, హెల్త్, ఇంజినీరింగ్ తదితర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఫుట్‌పాత్ మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల్లో భద్రతా లోపాలు, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, దుకాణాలు, లైసెన్సులు, సీసీ కెమెరాల వ్యవస్థతో పాటు అనధికార కార్యకలాపాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని 30 షాపులకు టీటీడీ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న 13 మందిని గుర్తించి, సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఫుట్‌పాత్ మార్గంలో 6 మంది బెగ్గింగ్ చేస్తున్న వ్యక్తులను గుర్తించి, నిబంధనల ప్రకారం తిరుమల నుంచి కిందికి తరలించే చర్యలు చేపట్టారు.

అడవి జంతువుల కదలికలు ఉన్న ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించారు. భక్తులు, వ్యాపారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *