మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్) విభాగంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు జపాన్లోని ప్రతిష్ఠాత్మక ఐజు విశ్వవిద్యాలయంలో మూడు నెలల పరిశోధన ఇంటర్న్షిప్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ 2025లో ఐజు విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లో భాగంగా ఈ ఇంటర్న్షిప్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఐజు విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి అర్జున్ పొగాకు పర్యవేక్షణలో, ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ కిరణ్ రాగే మార్గదర్శకత్వంలో విద్యార్థులు పరిశోధన కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన చేసే అవకాశం విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు నూతన ఆవిష్కరణలపై అవగాహన పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు. వివిధ దేశాల్లో అనుసరించే విద్యా, పరిశోధన విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం విద్యార్థుల భవిష్యత్ విద్యా, వృత్తి అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. మిట్స్ యూనివర్సిటీ, ఐజు విశ్వవిద్యాలయం మధ్య ఏర్పడిన అంతర్జాతీయ విద్యా సహకారం విద్యార్థులకు ప్రపంచస్థాయి పరిశోధన అవకాశాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించి, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ ఇంటర్న్షిప్ను విష్ణు వర్ధన్ నాయుడు మట్లి, లక్ష్మీ సాగర్ శేషాద్రి, భాను ప్రకాష్ నక్కల, కుమారి వరలక్ష్మి ఉట్టి, రెడ్డి లోకేష్ కురబలకోట, మోహన్ కృష్ణ మదమంచి, భార్గవ్ ఎం.సి., సూర్యవీర మాయకుంట్ల విజయవంతంగా పూర్తి చేశారు. పరిశోధన ఇంటర్న్షిప్ ను పూర్తి చేసిన విద్యార్థులను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ మరియు తదితరులు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, అసోసియేట్ డైరెక్టర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ.విజయలక్ష్మి, విభాగాధిపతి డాక్టర్ ఎస్.పద్మ, అర్జున్ పొగాకు, సుస్మిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
జపాన్లోని ఐజు విశ్వవిద్యాలయంతో పరిశోధన ఇంటర్న్షిప్ పూర్తి చేసిన మిట్స్ విద్యార్థులు
