కొలబైలు వద్ద కృష్ణా జలాల తరలింపు పనుల పరిశీలన

మదనపల్లె: మదనపల్లె మండలం కొలబైలు కెనాల్‌ వద్ద హంద్రీ–నీవా కాలువ ద్వారా వస్తున్న కృష్ణా జలాల తరలింపు పనులను మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా మరోసారి పరిశీలించారు. నీటిని ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ.. హంద్రీ–నీవా సొరంగంలో మరో రెండు కొత్త హైస్పీడ్ మోటార్లు, పైప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇన్‌వెల్ మోటార్ల ద్వారా హంద్రీ–నీవా కాలువలోని కృష్ణా జలాలను తోడి, ఆరు పైప్‌లైన్ల ద్వారా సుమారు 1.5 కిలోమీటర్ల ఎగువ ప్రాంతానికి నీటిని పంపింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

సొరంగం నుంచి వచ్చే పైప్‌లైన్లను కోళ్లబైలు–2 పంచాయతీలోని అమ్మచెరువు కాలువకు అనుసంధానం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటే ఆరు మోటార్ల ద్వారా నీటిని ఎగువ ప్రాంతాలకు నిరంతరాయంగా పంపింగ్ చేయవచ్చని తెలిపారు.

ఈ పనులు పూర్తయితే అమ్మచెరువు పరిసర ప్రాంతాలకు నీటి లభ్యత మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాల పెంపునకు కూడా దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి రాటకొండ శ్రీనివాసులు నాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *