కూటమి పాలనలో విద్యారంగానికి మహర్దశ RJ వెంకటేష్

నిమ్మనపల్లె, సెప్టెంబర్ 9: కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్.జె. వెంకటేష్ పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

బుధవారం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లి పంచాయతీ పరిధిలోని ఆచార్లపల్లె, ఎగువ మాచిరెడ్డిగారిపల్లె, దిగువ మాచిరెడ్డిగారిపల్లె, రాచవేటివారిపల్లె, గుండ్లబురుజు, బొంతవారిపల్లె గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు నోటు పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, పెన్నులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్స్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, షైనింగ్ స్టార్స్ వంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ప్రోత్సాహం అందుతోందన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను అవగాహన చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాచవేటివారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేయడం ఆనందంగా ఉందని వెంకటేష్ తెలిపారు.

అలాగే ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో నిమ్మనపల్లె మండల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు వెల్లడించారు.

విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించిన ఆర్.జె. వెంకటేష్‌తో పాటు టీడీపీ నాయకుల సేవా కార్యక్రమాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *