కాకినాడ: కాకినాడలోని ఎస్‌కే నర్సింగ్ కాలేజీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు ఎదురైన వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది.
కళాశాలలో విద్యార్థినుల మధ్య చోటుచేసుకున్న పరస్పర దాడుల ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించినట్లు సమాచారం. సమస్యను తక్షణమే పరిష్కరించి, విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనపై దృష్టి సారించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రతకు పూర్తి భరోసా కల్పించడంతో పాటు అవసరమైన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం కళాశాల యాజమాన్యంతో అధికారులు చర్చలు జరిపి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించి తమ భద్రతకు భరోసా కల్పించడంపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల అనంతరం అధికారుల వేగవంతమైన చర్యలతో పరిస్థితి అదుపులోకి వచ్చి, వివాదం మరింత ముదరకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది.
