ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

మదనపల్లి, అక్టోబరు 19:

ఈ నెల 14 వ తేది ఎన్నికల షెడ్యూల్‌లో ప్రకటించిన విధముగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ నేపథ్యంలో… ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, ఎన్నికల అబ్జర్వర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డా. ఏ. మల్లిఖార్జున, ఐజీ బి. రాజకుమారి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు వెంకట రామకృష్ణ తేజ లతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో… జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జనరల్ అబ్జర్వర్‌ జి. బాలకృష్ణ, ఎన్నికల వ్యయ పరిశీలకురాలు ఎం. బబితా, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ హాజరయ్యారు.

వీసీలో ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో మొత్తం 28 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో 659 జెడ్పీటీసీ స్థానాలకు, 659 మండల ప్రజా పరిషత్‌ల పరిధిలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు:

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను నిబంధన మేరకు పక్కగా ఏర్పాటు చేయాలన్నారు. వీటిలో సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ప్రక్రియలను పూర్తిచేసి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు ఎన్నికల కమిషనర్ కు వివరించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ వెంకటేష్, జడ్పీ సీఈవో లక్ష్మీపతి, డిప్యూటీ సీఈవో కేఎల్ ప్రభాకర్ రావు, డిపిఓ రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *