15 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ.. జబర్దస్త్ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు
మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)మదనపల్లి పట్టణంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాష తెలిపారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పట్టణ ప్రముఖులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆగస్టు 12న మిషన్ కాంపౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 13న సుమారు 15 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆగస్టు 14న సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మిషన్ కాంపౌండ్లో ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పట్టణ ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గత రెండేళ్లుగా నిర్వహించిన కార్యక్రమాలకు భిన్నంగా ఈసారి ప్రత్యేక ఆకర్షణలతో వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ జబర్దస్త్ కళాకారులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను అలరించనున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లో మరింత పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
సమావేశంలో విజయవాడ హైస్కూల్ చైర్మన్ సేతు, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాజల్ల విద్యాసాగర్, నవీన్ చౌదరి, విద్యాశాఖ అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
