రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికీ: సుగవాసి ప్రసాద్ బాబు

మదనపల్లెలో ఘనంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం

మదనపల్లె, ఆగస్టు 10: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం సోమవారం మదనపల్లె పట్టణంలోని 191, 192 పోలింగ్ బూతుల పరిసర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.

రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, నియోజకవర్గ పరిశీలకుడు నెట్టెం వెంకటేష్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు GTV Mediaతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలకు ఊపునిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతమవుతోందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవా దృక్పథం కూటమి ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తోందని సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు.

ప్రభుత్వం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూడాలనే లక్ష్యంతో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గ పరిశీలకుడు నెట్టెం వెంకటేష్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘ఇంటింటికీ తెలుగుదేశం – ప్రతి కుటుంబానికి అభివృద్ధి, ప్రతి పేదింటికి సంక్షేమం’ అనే లక్ష్యంతో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుగవాసి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *