కళ్లకు కట్టినట్లుగా మహాభారత పర్వాలు: నేటి డిజిటల్ యుగంలోనూ పల్లెల్లో రక్తికడుతున్న పురాణ ప్రవచనాలు!

నిమ్మనపల్లి (అన్నమయ్య జిల్లా ): (gtvmedia)కాలం ఎంత మారినా, చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చినా మన ప్రాచీన సంస్కృతి, ఇతిహాసాల పట్ల గ్రామీణ భారత్‌లో ఆదరణ కొంచెమైనా తగ్గలేదని నిమ్మనపల్లి మండలంలోని సంఘటనలు నిరూపిస్తున్నాయి. మహాభారతంలోని 18 పర్వాలను 18 రోజుల పాటు కళ్లకు కట్టినట్లుగా భాగవతార్ భక్తులకు వినిపిస్తూ అలరిస్తున్నారు.

మండలంలోని బాలినేనిపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన మహాభారత ప్రవచనంలో భాగంగా ‘భీష్మ ఘట్టాన్ని’ భాగవతార్ ఎంతో మనోహరంగా వివరించారు.

రాజ్య త్యాగం.. భీష్ముని మహత్తర ప్రతిజ్ఞ!

కురు వంశంలో సంతానలేమి ఎదురై, రాజ్యానికి తదుపరి రాజు ఎవరనే మీమాంస నెలకొన్న క్లిష్ట సమయంలో… వంశ శ్రేయస్సు కోసం, రాజ్య సంక్షేమం కోసం భీష్ముడు సర్వ పరిత్యాగిగా మారిన తీరును భాగవతార్ పూసగుచ్చినట్లు వివరించారు. తన సుఖ సంతోషాలను, రాజ్యాధికారాన్ని త్యాగం చేస్తూ ఆయన చేసిన మహత్తర ప్రతిజ్ఞను స్మరిస్తూ, భీష్ముని త్యాగనిరతిని భక్తులకు అర్థమయ్యేలా కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు.

రీల్స్ యుగంలోనూ అభినందనీయమైన ఆదరణ

అరచేతిలో మొబైల్ ఫోన్, నిమిషాల్లో మారిపోయే సోషల్ మీడియా రీల్స్ మరియు షార్ట్స్‌కు అలవాటుపడిన నేటి సమాజంలో… గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పటికీ రాత్రివేళల్లో మైకు ద్వారా వస్తున్న భారత కథలను శ్రద్ధగా వింటూ ఆదరించడం విశేషం. ఆధునిక వినోదాలకు దూరంగా, తమ సంస్కృతీ సంప్రదాయాలను రక్షించుకుంటూ పురాణ గాథలను ఆదరిస్తున్న పల్లెవాసులను పలువురు పండితులు, గ్రామ పెద్దలు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *