రాయచోటి, ఆగస్టు 6:( gtvmedia)వీఐపీ బందోబస్తు విధులు, పేలుడు పదార్థాల గుర్తింపులో ఎన్నో కీలక సేవలందించిన అన్నమయ్య జిల్లా పోలీసు జాగిలం ‘రాజా’ (ల్యాబ్రడార్) అనారోగ్యంతో గురువారం కన్నుమూసింది.

రాయచోటిలోని పాత పోలీసు క్వార్టర్స్‌లో రాజా పార్థివ దేహానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖకు రాజా అందించిన విశిష్ట సేవలను ఆయన స్మరించుకున్నారు. అనంతరం పోలీసు లాంఛనాలతో రాజా అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, సీఐలు చలపతి, రోషన్, కృష్ణంరాజు నాయక్, చాంద్ బాషా, ఆర్ఐ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు, ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని రాజాకు కడసారి వీడ్కోలు పలికారు.
విధి నిర్వహణలో విశేష సేవలందించిన రాజా మృతితో పోలీసు శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి.
