ఏపీటెట్ జూన్–2026 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

నెల 5 నుంచి 16 వరకు ఏపీటెట్ జూన్–2026 పరీక్షలు

నాలుగు కేంద్రాలలో… పరీక్షలకు హాజరుకానున్న 5,470 మంది అభ్యర్థులు

మదనపల్లి, ఆగస్టు 3: (gtvmedia)

ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు అన్నమయ్య జిల్లాలో నిర్వహించనున్న ఏపీటెట్ జూన్–2026 ఆన్‌లైన్ పరీక్షలను ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివనారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో… ఈనెల ఐదు నుంచి ప్రారంభం కానున్న ఏపీటెట్ జూన్–2026 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ పరీక్షల నిమిత్తం జిల్లాలో మొత్తం నాలుగు ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ తెలిపారు. వాటిలో మదనపల్లెలో రెండు, రాయచోటిలో రెండు కేంద్రాలు ఉన్నాయని, మొత్తం 5,470 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని సాంకేతిక సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో తగిన సంఖ్యలో కంప్యూటర్లు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం పవర్ బ్యాకప్, నాణ్యమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

శాఖల వారీగా నియమించిన అధికారులు పరీక్షా కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అవసరమైతే సెక్షన్–144 అమలు చేయాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు.

అభ్యర్థుల రాకపోకలకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖలకు సూచించారు.

ఆగస్టు 5 నుంచి 16 వరకు ఏపీటెట్ జూన్–2026 పరీక్షలు జరగనున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నరసయ్య, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు, ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మేనేజర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, కళాశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *