వలసపల్లె, ఆగస్టు 2:( gtvmedia)జవహర్ నవోదయ విద్యాలయాల్లో 35 సంవత్సరాల పాటు జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా విశిష్ట సేవలు అందించిన కే. శైలజ పదవీ విరమణ సందర్భంగా వలసపల్లెలో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. కార్యక్రమం గురు-శిష్య బంధాన్ని ప్రతిబింబించేలా భావోద్వేగ వాతావరణంలో సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవోదయ విద్యాలయ సమితి రిటైర్డ్ కమిషనర్ టి. గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శైలజ మేడం తన 35 ఏళ్ల ఉపాధ్యాయ ప్రస్థానంలో వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆమె వద్ద విద్యనభ్యసించిన శిష్యులు దేశ, విదేశాల్లో వైద్యులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు తదితర ఉన్నత స్థానాల్లో సేవలందిస్తుండటం ఆమె బోధనా నైపుణ్యానికి నిదర్శనమని అన్నారు.
విద్యార్థుల జీవితాల్లో విలువలు, విజ్ఞానం, క్రమశిక్షణ పెంపొందించడంలో శైలజ మేడం అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమ గురువుతో గడిపిన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. శైలజ మేడం సేవలను చిరస్థాయిగా నిలుపుతూ ఆమె జ్ఞాపకార్థం రూ.4,05,000 డిపాజిట్ చేసి, ఆ నిధిపై వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం జీవశాస్త్రంలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు “సైన్స్ ఎక్సలెన్స్ అవార్డులు”, వినూత్న ఆలోచనలకు “ఇన్నోవేషన్ అవార్డులు” అందించాలని నిర్ణయించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో లేపాక్షి, కడప, చిత్తూరు జవహర్ నవోదయ విద్యాలయాల పూర్వ విద్యార్థులు, వివిధ విద్యాలయాల ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, మోహనవల్లి భరణి, డాక్టర్ కిరణ్, పార్థసారథి, వేమనారాయణ, రఘురాములు, ద్రాక్షాయిణి, ఎల్లప్ప, జనార్ధన్, భాస్కర్ రెడ్డి, నాగవేలు, ధనంజయ్ తదితరులు పాల్గొని శైలజ మేడంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
