ఈ నెల 20న జెడ్పీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం నాటికి కార్యాలయాన్ని సిద్ధం చేయాలి
సిబ్బంది, ప్రజాప్రతినిధులకు అనువుగా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశం
మదనపల్లి, నవంబర్ 11:
జిల్లా కేంద్రం మదనపల్లిలో ప్రస్తుతం ఉన్న జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని అభివృద్ధి చేస్తున్న నూతన భవనంలోకి మార్చే ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు.
మదనపల్లిలోని బి.టి. కళాశాల వెనుక భాగంలో ఉన్న పాత రవీంద్రనాథ్ ఠాగూర్ భవనాన్ని మరమ్మత్తులు చేసి, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంగా వినియోగించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ నిర్వహణకు అవసరమైన గదులు, సిబ్బందికి ప్రత్యేక కార్యాలయ వసతులు, జిల్లా పరిషత్ చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యాలయంలో విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి అనువుగా కార్యాలయ గదులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జిల్లా పరిషత్ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం నాటికి కార్యాలయాన్ని అన్ని హంగులతో సిద్ధం చేయాలని, పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. నూతన కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యకలాపాలు సజావుగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.
కార్యాలయ మార్పిడి అనంతరం జిల్లా పరిషత్ సమావేశాలను కూడా నూతన భవనంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీపతి, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

