పత్రికా ప్రకటన

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పక్కాగా పాటించాలి

నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదు

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి విధులు నిర్వహించాలి

*జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి, నవంబర్ 11: అన్నమయ్య జిల్లాలో ఈ నెలలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

బుధవారం మదనపల్లిలోని ఎన్.జె.ఆర్. ఫంక్షన్ హాలులో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టేజ్-1 అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో స్టేజ్-1 అధికారుల పాత్ర, బాధ్యతలు, విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తదితర ప్రతి దశలోనూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అందులోని మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సందేహాలు ఉంటే ముందుగానే నివృత్తి చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు, వివాదాలు, సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ వంటి కీలక సందర్భాల్లో అవసరమైన చోట వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల విధులను అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనకు అవకాశం లేకుండా చూడాలన్నారు.

అనంతరం ఎన్నికల విధులు, నిర్వహణపై శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, జిఎస్డబ్ల్యూఎస్ అధికారి అమర్నాథరెడ్డి, డీఈవో సుబ్రమణ్యం, డిఎల్డిఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, సంబంధిత ఎన్నికల అధికారులు, స్టేజ్-1 అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *