మదనపల్లెలో యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సమావేశం

విద్యారంగ సమస్యలపై ప్రభుత్వానికి యూఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్లు

మదనపల్లె, ఆగస్టు 1: (gtv media)అన్నమయ్య జిల్లా యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా విస్తృతస్థాయి సమావేశం శనివారం మదనపల్లె పట్టణంలోని నేచురోపతి కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థిలోకం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో విడుదల చేసిన UDISE+ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,00,843 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 16,357 పాఠశాలలు ఉన్నాయని నరసింహ పేర్కొన్నారు. ఏపీ తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా 54 బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేయడం దురదృష్టకరమని, ఉమ్మడి అన్నమయ్య జిల్లాలో 14 బీసీ వసతి గృహాలను మూసివేయడం అన్యాయమని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కోడూరు డివిజన్ పరిధిలో ఒక్క బీసీ బాలుర వసతి గృహం కూడా లేకపోవడం వల్ల పేద, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి, మూసివేస్తున్న వసతి గృహాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే సంక్షేమ హాస్టళ్లలో తాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్లు, దోమతెరలు, ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించడం వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అన్నమయ్య జిల్లా విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మదనపల్లిలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కూడా యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు.

సమావేశంలో యూఎస్‌ఎఫ్‌ఐ అన్నమయ్య జిల్లా నాయకులు ఆఫ్రిద్, కమలాకర్, యువరాజ్, మనోజ్, సాయికుమార్ రెడ్డి, రామ్‌తేజ, సుల్తాన్, సంతోష్, ఆదినారాయణ, భాను, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *