అక్టోబర్ 25 వరకు అభ్యర్థుల తుది జాబితా వాయిదా
నామినేషన్ల గడువు పెంపుపై నేడు నిర్ణయం
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో జరుగుతున్న 100 పట్టణ స్థానిక సంస్థల (13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు) ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25వ తేదీ వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అయితే, శాంతిభద్రతల సమస్యల కారణంగా నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులు, ప్రతిపక్ష పార్టీల విజ్ఞప్తులను, వారు సమర్పించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను సమగ్రంగా పరిశీలించి నామినేషన్ల గడువు పెంచే అంశంపై అక్టోబర్ 22 నాటికి ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. ఒకవేళ నామినేషన్ల గడువు పెంచాలని కమిషన్ భావిస్తే.. అభ్యర్థులకు కనీసం 48 గంటల అదనపు సమయం ఇవ్వాలని కోర్టు తన ఉత్తర్వుల్లో (SLA(C) No. 37476/2026) స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తాజా ఉత్తర్వుల్లో (ఆర్డర్ నెం. 738) పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అక్టోబర్ 22న తదుపరి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
