మిట్స్‌లో భూకంప ఇంజినీరింగ్‌ (ఇంజినీరింగ్ సిస్మాలజీ) పై అతిథి ఉపన్యాస కార్యక్రమం.

మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్‌) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగం వారు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ASCE) వారి ఆధ్వర్యంలో ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో విద్యార్థులకు “భూకంప ఇంజినీరింగ్ మరియు గత భూకంపాల సాంకేతిక విశ్లేషణ ద్వారా నేర్చుకోవాల్సిన అంశాలపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూరత్‌కల్ రిటైర్డ్ ప్రొఫెసర్ (HAG), కట్టా వెంకటరమణ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు భూకంపాల ప్రాథమిక సూత్రాలు, భూకంప తరంగాల స్వభావం, సీస్మోగ్రాఫ్‌ల పనితీరు మరియు భూకంపాలను శాస్త్రీయంగా నమోదు చేసే విధానాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. హిమాలయాల ఆవిర్భావానికి సంబంధించిన టెక్టానిక్ కదలికలు, వాటి ప్రభావంతో ఏర్పడే భూకంప కార్యకలాపాలను వివరించారు. ఆనకట్టలు, జలాశయాల వల్ల భూకంప కార్యకలాపాలపై కలిగే ప్రభావం, భూకంప నిరోధక పరికర నిర్మాణాల రూపకల్పన, భవనాల నిర్మాణంలో పాటించాల్సిన సాంకేతిక ప్రమాణాలు మరియు భూకంపాలను తట్టుకునేలా భవనాల రూపకల్పనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గతంలో సంభవించిన వివిధ భూకంపాల కేస్ స్టడీలను ప్రస్తావిస్తూ, ఆయా విపత్తుల సమయంలో భవనాలకు జరిగిన నష్టం, నిర్మాణ వైఫల్యాలకు దారితీసిన కారణాలు మరియు వాటి నుంచి ఇంజినీరింగ్ రంగం నేర్చుకున్న పాఠాలను విద్యార్థులకు వివరించారు. గత భూకంపాల అనుభవాలను భవిష్యత్‌లో సురక్షితమైన, మన్నికైన నిర్మాణాల రూపకల్పనకు ఉపయోగించుకోవాలని సూచించారు. భూకంప నిరోధక నమూనాలపై ప్రయోగాత్మక ప్రదర్శనలు నిర్వహించి, భూకంప సమయంలో భవనాల ప్రవర్తనను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు. భూకంప ఇంజినీరింగ్‌లో పరిశోధనా అవకాశాలు, ఆధునిక నిర్మాణ సాంకేతికతలు మరియు భూకంప నిరోధక డిజైన్ విధానాలపై అవగాహన కల్పించారు. భూకంపాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, శాస్త్రీయ అవగాహన, సరైన డిజైన్, నాణ్యమైన నిర్మాణ పద్ధతులు మరియు భూకంప నిరోధక ప్రమాణాలను పాటించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. నిర్మాణ రంగంలో భద్రత, మన్నిక మరియు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్ సివిల్ ఇంజినీర్లు సమాజానికి సురక్షితమైన మరియు స్థిరమైన మౌలిక వసతులను అందించే దిశగా పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతి డాక్టర్ విజయకుమార్ ఎన్, కోఆర్డినేటర్ డాక్టర్ కె. ఇమ్రాన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *