మదనపల్లె, అక్టోబర్ 14: అన్నమయ్య జిల్లాలోని 25 మండలాలకు సంబంధించి జడ్పీటీసీ సభ్యుల స్థానాలు, మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆయా స్థానాలను వివిధ సామాజిక వర్గాలకు కేటాయించారు. జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి విడుదల చేసిన రిజర్వేషన్ల వివరాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్‌రిజర్వుడ్ కేటగిరీలకు స్థానాలు కేటాయించగా, కొన్ని స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు.
మదనపల్లె జడ్పీటీసీ స్థానం అన్‌రిజర్వుడ్ మహిళకు
జిల్లాలోని 25 జడ్పీటీసీ స్థానాల్లో మదనపల్లె స్థానాన్ని అన్‌రిజర్వుడ్ మహిళా కేటగిరీకి కేటాయించారు. తంబళ్లపల్లె స్థానాన్ని ఎస్టీ కేటగిరీకి, చౌడేపల్లెను ఎస్సీ మహిళా కేటగిరీకి కేటాయించారు. నిమ్మనపల్లె, పుంగనూరు స్థానాలు ఎస్సీ కేటగిరీకి రిజర్వు కాగా, గుర్రంకొండ, కలకడ, కురబలకోట, సోడం స్థానాలను బీసీ కేటగిరీకి కేటాయించారు.
మిగిలిన మండలాల జడ్పీటీసీ స్థానాలకు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎంపీపీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు కూడా అధికారిక ఉత్తర్వుల ప్రకారం అమలులోకి రానున్నాయి.
రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆశావహులు, రాజకీయ పార్టీల నాయకులు ఆయా స్థానాల కేటాయింపులపై దృష్టి సారిస్తున్నారు.
