తిరుపతి, సెప్టెంబర్ 17:
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ నేతృత్వంలో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

తప్పిపోయే అవకాశమున్న చిన్నారులు, వృద్ధులకు బయో ట్యాగ్లు ఏర్పాటు చేసి వారి వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో వారు కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన సందర్భంలో త్వరగా గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు.
భక్తుల రద్దీ, క్యూలైన్లు, కీలక ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీస్ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు.

అలాగే చిన్నారులు, వృద్ధుల భద్రతపై భక్తులకు ముందస్తు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను మోహరించి నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
భక్తులు తమ వెంట ఉన్న చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీపంలోని పోలీస్ సిబ్బందిని లేదా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని జిల్లా పోలీస్ శాఖ సూచించింది.
