కలెక్టర్ల సమావేశం ఆదేశాలపై అధికారులతో కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష
మదనపల్లె, సెప్టెంబర్ 15:
రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలు, సూచనలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో… జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో శాఖల వారీగా చర్చించిన అంశాలు, ముఖ్యమంత్రి నిర్దేశించిన కార్యాచరణ, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.
ఇదిలా ఉండగా, జిల్లాలో మంత్లీ ఎకనామిక్ రిపోర్టులో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం, అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPIs)లో జిల్లా పనితీరు గణనీయంగా మెరుగుపడటంతో పాటు నాన్-కీ KPIsలో రాష్ట్రంలోని టాప్–4 జిల్లాల్లో స్థానం సాధించడం పట్ల కలెక్టర్ నిశాంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా పనితీరులో ఈ మార్పు అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేస్తున్న కృషికి నిదర్శనమని కలెక్టర్ అధికారులను అభినందించారు
కలెక్టర్గా ఏడాది ప్రస్థానం.. అధికారుల శుభాకాంక్షలు
అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించి నేటికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కలెక్టరుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో అధికారులు, సిబ్బంది అందిస్తున్న సహకారాన్ని కలెక్టర్ అభినందిస్తూ, ఇదే సమన్వయం, అంకితభావంతో జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డిఆర్ఓ వెంకటేష్, ఆర్డీవోలు శ్రీనివాస్, విజయలక్ష్మి, ఎస్డీసీలు చంద్రశేఖర్ రెడ్డి, మాధవ కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
