మదనపల్లి, సెప్టెంబర్ 14: మదనపల్లి పట్టణంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజలు ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా బుగ్గ కాలువ, నెహ్రూ నగర్లోని హెచ్పీ గ్యాస్ కార్యాలయం వెనుక వీధి, ఆర్యవైశ్య హాస్టల్, సీటీఎం రోడ్డులో జీఆర్టీ జ్యువెలర్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మదనపల్లి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా సందర్శించారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, కోటవారిపల్లి సొక్కం వేణుగోపాల్, పూల మురళి, తాళ్ల మధు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా నియోజకవర్గ ప్రజలకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
