“విద్యార్థుల విజయం మా బహుమతి” – రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్
మదనపల్లె: సెప్టెంబర్ 5 మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ)లో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్ పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ “మీ ఆలోచనా శక్తే మీ గొప్ప గురువు” అని పేర్కొన్నారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకత, ప్రశ్నించే తత్వం, ఆలోచనా శక్తిని నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు.
బోధనా వృత్తి ఒక మహోన్నతమైన వృత్తి అని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, కృషి, అంకితభావం ఎంతో ముఖ్యమని తెలిపారు.

“విద్యార్థుల విజయం మా బహుమతి” అని పేర్కొన్న ఆయన.. ఒక విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకుని మంచి స్థానాన్ని సంపాదించినప్పుడు, ఆ విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి, మార్గదర్శకత్వం, అంకితభావం ఉంటాయని అన్నారు. విద్యార్థుల విజయమే ఉపాధ్యాయులకు లభించే అత్యంత విలువైన గుర్తింపు అని పేర్కొన్నారు.
యూనివర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించేవారిగా కాకుండా, జ్ఞానం, విలువలు, క్రమశిక్షణ, జీవన నైపుణ్యాలను అందించే మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. విద్యాపరమైన అభివృద్ధితో పాటు నైతిక విలువలు కలిగిన మంచి వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డైరెక్టర్–అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్, డీన్–స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, డీన్–స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి. రాజేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
