డిగ్రీ ప్రవేశాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలి

మదనపల్లి, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ ఇప్పటివరకు ప్రవేశాల ప్రక్రియపై స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర ఆందోళనకరమని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యు.ఎస్.ఎఫ్.ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి అన్నారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రశాంత్ నగర్‌లోని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చేరేందుకు ఎదురుచూస్తున్నారని, అయితే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలో జరుగుతున్న జాప్యం కారణంగా విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.

ఒకవైపు విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా, మరోవైపు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తికాకపోవడం వల్ల విద్యార్థుల విలువైన సమయం నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

డిగ్రీ ప్రవేశాల్లో జాప్యం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకుండా తక్షణమే డిగ్రీ ప్రవేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విద్యార్థులను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో యుఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆఫ్రిద్, కమలాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *