ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి: సెప్టెంబర్ 5 : శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాండవ్య నది ఒడ్డున ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ శనివారం వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కీర్తిశేషులు శ్రీ సుగవాసి పాలకొండరాయుడు నిర్మించిన ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారి దర్శనం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, రాయచోటి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
చివరి శ్రావణ శనివారం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. రామనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
భక్తులకు అన్నదానం
భక్తుల కోసం డిష్ హెడ్ మెకానిక్ గురవయ్య–శివమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, అభివృద్ధి, ఐశ్వర్యం నిండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ వాకా అన్నయ్య ప్రసాద్ బాబుకు ఆత్మీయ స్వాగతం పలికి శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
