అన్నమయ్య జిల్లాలో భూకబ్జాలు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ ధీరజ్

మదనపల్లి, జూలై 27: (gtvmedia)అన్నమయ్య జిల్లాలో పెరుగుతున్న భూకబ్జాలు, సైబర్ నేరాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులపై ప్రత్యేక దృష్టి సారించి, తక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు.

సోమవారం మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 83 ఫిర్యాదులు అందగా, వాటిలో అత్యధికంగా 52 భూ వివాదాలకు సంబంధించినవే కావడం గమనార్హం.

మిగిలిన ఫిర్యాదుల్లో ఆర్థిక, కుటుంబ వివాదాలు చెరో 7, మోసాలకు సంబంధించినవి 6, ఇతర సమస్యలు 5, న్యూసెన్స్‌కు సంబంధించినవి 4, అలాగే ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించినవి 2 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ, భూకబ్జాలు, సైబర్ నేరాలు, అధిక వడ్డీ వ్యాపారుల వేధింపులకు సంబంధించిన ప్రతి ఫిర్యాదుపై తక్షణ విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారుల పట్ల ఎలాంటి ఉపేక్ష ఉండదని ఎస్పీ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *