స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ‘పల్లె నిద్ర’

మదనపల్లె, ఆగస్టు 31: (gtvmedia)అన్నమయ్య జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లాలోని 25 మండలాల్లో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు వంతులవారీగా గ్రామాలకు వెళ్లి రాత్రి వేళల్లో అక్కడే బస చేస్తున్నారు. గ్రామస్తులతో మమేకమై పిచ్చాపాటిగా మాట్లాడి, గ్రామంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు, స్థానికంగా నెలకొన్న వివాదాలు, ఇతర ఇబ్బందులపై వివరాలు తెలుసుకుంటున్నారు.

వర్గ వైషమ్యాలను పక్కనపెట్టి ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరుతున్నారు.

అదేవిధంగా మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, దొంగతనాల నివారణ వంటి అంశాలపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లోనే బస చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో కొత్తగా లేదా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపించినా, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *