అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 62 మంది ఎన్సీసీ క్యాడెట్లకు సర్టిఫికెట్లు
మదనపల్లె: (gtvmedia)మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎన్సీసీ ‘బి’, ‘సి’ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ప్రతిష్టాత్మక ఎన్సీసీ ‘బి’, ‘సి’ సర్టిఫికెట్ పరీక్షల్లో మిట్స్ యూనివర్సిటీకి చెందిన క్యాడెట్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ.. మొత్తం 28 మంది క్యాడెట్లు ‘బి’ సర్టిఫికెట్ పరీక్షకు హాజరై అందరూ ఏ గ్రేడ్ సాధించారని తెలిపారు. అలాగే ‘సి’ సర్టిఫికెట్ పరీక్షకు హాజరైన 34 మంది క్యాడెట్లలో 16 మంది ఏ గ్రేడ్, 18 మంది బి గ్రేడ్ సాధించారని పేర్కొన్నారు.
మొత్తం 62 మంది ఎన్సీసీ క్యాడెట్లు సర్టిఫికెట్లు సాధించడం పట్ల యూనివర్సిటీ యాజమాన్యం అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా 35 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మోనిష్, చిత్తూరు 35 ఆంధ్రా బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ క్యాడెట్లకు అధికారికంగా సర్టిఫికెట్లను అందజేశారు.

క్యాడెట్లకు నిరంతరం మద్దతు, ప్రోత్సాహం అందిస్తున్న 35 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మోనిష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్, తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దహియాలకు యూనివర్సిటీ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయం మిట్స్ యూనివర్సిటీలోని ఎన్సీసీ అధికారులు, ఫ్యాకల్టీ మెంటర్ల సమర్థవంతమైన మార్గదర్శకత్వంతో పాటు క్యాడెట్ల క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలకు నిదర్శనమని యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఎన్సీసీ అందించే ‘బి’, ‘సి’ సర్టిఫికెట్లు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టుకృషి, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను పెంపొందించడంతో పాటు వారి భవిష్యత్ కెరీర్ అవకాశాలకు కూడా ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో యూనివర్సిటీ అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్, ఎన్సీసీ సిబ్బంది, క్యాడెట్లు పాల్గొన్నారు.
