పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పుకు తెరపడింది. ప్రస్తుత ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి స్థానంలో మధుసూదన్ నాయుడు ఎనుగంటిను నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ నియామకాన్ని ప్రకటించినట్లు సమాచారం.

ఇన్చార్జ్ మార్పుపై కొంతకాలంగా పుంగనూరు టీడీపీ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. పార్టీ అధిష్ఠానం కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. ఇటీవల తిరుపతిలో జరిగిన అభిప్రాయ సేకరణ సమావేశంలో పుంగనూరులో పార్టీ బలోపేతం, భవిష్యత్ నాయకత్వం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఎట్టకేలకు మధుసూదన్ నాయుడు ఎనుగంటిని ఇన్చార్జ్గా నియమించడంతో ఆయన వర్గీయులు, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ‘జై తెలుగుదేశం.. జై మధుసూదన్ నాయుడు’ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మధుసూదన్ నాయుడు ఎనుగంటికి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలతో పుంగనూరులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన ఏ విధంగా ముందుకు సాగుతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

