పీలేరులో 185 కిలోల ఎర్రచందనం దుంగలు పట్టివేత

పీలేరు, ఆగస్టు 28:( gtvmedia)అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పీలేరు ఏం.జే.ఆర్. కళాశాల సమీపంలో రాత్రి నిర్వహించిన నిఘాలో రెండు వాహనాల్లో తరలిస్తున్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది ఏం.జే.ఆర్. కళాశాల సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న రెండు వాహనాలను గుర్తించి వెంబడించారు. వాహనాలను నిలిపేందుకు ప్రయత్నించగా నిందితులు అటవీ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన ఇద్దరిని విచారించగా వారు తమిళనాడుకు చెందినవారిగా అధికారులు తెలిపారు. రెండు వాహనాల్లో మొత్తం ఆరు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం బరువు సుమారు 185 కిలోలు కాగా, అంచనా విలువ రూ.8,24,314 ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలను పీలేరు అటవీశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితులపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ దాడిలో పీలేరు అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *