నలుగురు అరెస్ట్.. రూ.1.02 లక్షల నగదు స్వాధీనం
రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్
తిరుపతి, ఆగస్టు 28: (gtvmedia)జూదం, పేకాటతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టిన చర్యల్లో భాగంగా పుత్తూరు అర్బన్ పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో జూద స్థావరాన్ని గుర్తించి దాడి నిర్వహించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పుత్తూరు మండలం కేబీఆర్ పురం గ్రామ పరిధిలోని సెలంకొండ కొండ ప్రాంతంలో జూదం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో గురువారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో పుత్తూరు SDPO ఆధ్వర్యంలో పుత్తూరు అర్బన్ పోలీసు సిబ్బంది డ్రోన్ కెమెరా సహాయంతో ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు.
జూదం జరుగుతున్న స్థావరాన్ని గుర్తించిన అనంతరం పోలీసులు దాడి చేసి అక్కడ జూదం ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,02,570 నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులు
- బెనర్జీ – రైల్వే కోడూరు
- దేవేంద్రన్ – తిరువల్లూరు
- పి.కె. మురళి – పల్లిపట్టు
- సి. సునీల్ గవాస్కర్ – కేబీఆర్ పురం
పోలీసులు దాడి చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న మరికొందరు వ్యక్తులు పోలీసులను గమనించి అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన వారిలో మహేష్, పొన్నుస్వామి, సంజయ్, సైమన్, సుధాకర్, మోహన్‌రాజ్తో పాటు తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన స్విఫ్ట్ కారు యజమాని ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పరారైన వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించి, వారిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో జూదం, పేకాట, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీసు శాఖ తెలిపింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

