ప్రభుత్వ పాఠశాలల ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఆయాలకు 5 నెలలు.. వాచ్మెన్లకు 9 నెలల వేతనాలు బకాయివేతనాలు పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్

మదనపల్లె, ఆగస్టు 27: (gtvmedia)ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, వాచ్మెన్లకు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. వేతనాలు అందక ఆయాలు, వాచ్మెన్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల ఆయాల యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, అనంతరం డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల సంరక్షణ, పరిశుభ్రత, భద్రత వంటి కీలక బాధ్యతలను ఆయాలు, వాచ్మెన్లు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అయితే ఆయాలకు ఐదు నెలలుగా, వాచ్మెన్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసర సరుకులు, వైద్య ఖర్చులు వంటి కనీస అవసరాలను తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలను పూర్తిగా చెల్లించి, ఇకపై ప్రతి నెలా సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆయాలు, వాచ్మెన్ల వేతనాలను గణనీయంగా పెంచాలని, కనీస వేతనాలు అమలు చేసి వారి శ్రమకు తగిన గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు.

“సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించే ప్రభుత్వానికి ప్రభుత్వ పాఠశాలల్లో సంవత్సరాలుగా సేవలందిస్తున్న పేద కార్మికులకు వేతనాలు చెల్లించడానికి నిధులు లేవా?” అని సాంబశివ ప్రశ్నించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాలల ఆయాల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విమల, యశోదమ్మ, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, నర్సింహులు, ఏఐటీయూసీ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి ముభారక్, పట్టణ కార్యదర్శి తిరుమల, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవా, వాచ్మెన్లు లక్ష్మన్న, నేత్ర, గౌతమి, కౌశల్య, లక్ష్మీదేవి, హుస్సేన్ బీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *