క్రీడలతో క్రమశిక్షణ, నాయకత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి
యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి – ప్రధాని నరేంద్ర మోదీ
మదనపల్లె, ఆగస్టు 27: (gtvmedia)మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో “ఖేలో ఇండియా – ఖేల్ కీ బాత్ విత్ పీఎం మోదీ” కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా, మిట్స్ ఎన్ఎస్ఎస్, అన్నమయ్య జిల్లా మై భారత్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మిట్స్ యూనివర్సిటీకి చెందిన క్రీడా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వర్చువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా విద్యార్థులు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిర్ణయ సామర్థ్యం వంటి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
దేశంలోని యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన వేదికలు, శిక్షణ, అవకాశాలు కల్పించేందుకు “ఖేలో ఇండియా” వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ తమ ప్రతిభను మెరుగుపరుచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా “వికసిత్ భారత్ @2047” లక్ష్య సాధనలో యువత పాత్ర అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువత నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక అవగాహన, సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మై భారత్ వేదిక ద్వారా యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తూ వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే లక్ష్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, వాలీబాల్ సౌత్ జోన్ క్రీడాకారుడు సిద్ధార్థ్, బాస్కెట్బాల్ సౌత్ జోన్ క్రీడాకారిణి వైష్ణవి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ప్రతినిధి రాజ్ కుమార్, మై భారత్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, ఆర్. బాలాజీ, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పూజారి రాజేష్, క్రీడా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
