ఆదివారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి: యూఎస్‌ఎఫ్‌ఐ

మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)మదనపల్లె పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఆదివారం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని యూఎస్‌ఎఫ్‌ఐ (USFI) డిమాండ్ చేసింది.

విద్యార్థులకు చదువుతో పాటు విశ్రాంతి, మానసిక ప్రశాంతత, కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా అవసరమని యూఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పేర్కొన్నారు. వారానికి కేటాయించిన సెలవు రోజున కూడా తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని తెలిపారు.

మదనపల్లెలో సుమారు ఐదు పాఠశాలల్లో ఆదివారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారనే అంశంపై విద్యాశాఖ అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని కోరారు. సంబంధిత పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయితే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఆదివారం తరగతులకు హాజరు కావాలని విద్యార్థులు లేదా తల్లిదండ్రులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని యూఎస్‌ఎఫ్‌ఐ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆఫ్రిది, జిల్లా ఉపాధ్యక్షుడు కమలాకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యులు మనోజ్, గణేష్, సుథన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *