మదనపల్లె, ఆగస్టు 21: (gtvmedia)మెగా డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మదనపల్లె పట్టణంలోని మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన అభ్యర్థి రవీంద్ర నివాసాన్ని ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా సందర్శించారు.
ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ.. తాను 16 సంవత్సరాల పాటు దేశానికి సైనికుడిగా సేవలందించానని, అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి డీఎస్సీకి సిద్ధమయ్యానని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో మెరిట్ ఆధారంగా తనకు ఉపాధ్యాయ ఉద్యోగం లభించిందని పేర్కొన్నారు.
“ఈ ఉద్యోగం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎంతో కష్టపడి చదివాను. నా శ్రమకు తగిన ఫలితం లభించడం గర్వంగా ఉంది. మెరిట్ ఆధారంగా నాకు ఉద్యోగం వచ్చింది” అని రవీంద్ర తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. డీఎస్సీ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎంతో కష్టపడి, పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగాలు సాధించారని అన్నారు. మెగా డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
డీఎస్సీ నియామకాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే ఆరోపణలు చేయడం కంటే, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను స్వయంగా కలిసి వాస్తవాలను తెలుసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
“అభ్యర్థుల కష్టాన్ని, వారి ప్రతిభను రాజకీయ ఆరోపణల కోసం ప్రశ్నించడం సరికాదు. నియామకాలపై అనుమానాలు ఉంటే ఆధారాలతో మాట్లాడాలి. వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే విమర్శలు చేయాలి” అని షాజహాన్ భాషా అన్నారు.
