డిపాజిట్ల పేరుతో 200 మందికి టోకరా.. మేనేజర్ అరెస్ట్
ఫేక్ డాక్యుమెంట్లు, బిల్ బుక్స్, అగ్రిమెంట్లు స్వాధీనం
మోసం వెనుక ఉన్న బడాబాబుల గుర్తింపు.. త్వరలో అరెస్టులు: డీఎస్పీ
మదనపల్లె, ఆగస్టు 19:(gtvmedia)
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో స్క్రబ్ ఎక్స్‌ప్రెస్ సంస్థ పేరుతో ప్రజలను నమ్మించి సుమారు రూ.1.60 కోట్ల మేర నగదు వసూలు చేసి పరారైన సంస్థ మేనేజర్‌ను మదనపల్లె టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు తెలిపిన వివరాల మేరకు.. తిరుమలకొండ వెంకటేష్ అనే వ్యక్తి పట్టణంలోని సీటీఎం రోడ్డులో ఉన్న స్క్రబ్ ఎక్స్‌ప్రెస్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పాత్రలు శుభ్రం చేసే స్క్రబ్ తయారీ యంత్రాలను విక్రయిస్తున్నామని చెప్పి ప్రజలను ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు.
సంస్థలో రూ.లక్ష చొప్పున డిపాజిట్ చేస్తే అదనపు ఆదాయం వస్తుందని నమ్మించి పలువురి నుంచి నగదు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా మదనపల్లె ప్రాంతంలో సుమారు 200 మంది నుంచి నగదు వసూలు చేసినట్లు సమాచారం.
ఇటీవల స్క్రబ్ ఎక్స్‌ప్రెస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. సుమారు 80 మంది బాధితులు మదనపల్లె టూ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో మేనేజర్ తిరుమలకొండ వెంకటేష్ సుమారు రూ.1.60 కోట్లతో పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి ఫేక్ డాక్యుమెంట్లు, బిల్ బుక్స్, బాధితులు ఇచ్చిన అగ్రిమెంట్లు, యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బడాబాబులపై దర్యాప్తు
ఈ మోసం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారని డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరం వారిని కూడా అరెస్టు చేస్తామని వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తులో టూ టౌన్ ఎస్ఐ నాగేశ్వరతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
